Monday, November 16, 2009

ఏంటో ఈ రోజు ఆలోచనలు ఒక పట్టాన వదలటం లేదు. మాటి మాటికీ మా తాతయ్య గుర్తుకు వస్తున్నారు. అమ్మ , నాన్న ఇద్దరు జాబ్స్ చేయటం వల్ల మా అమ్మమ్మ , తాతయ్య మాతోనే ఉండేవారు. నేను మొదటి సారిగా హాస్టల్ లో ఉన్నది నా ఇంటర్మీడియట్ కోసం. అప్పుడు నాకు మా అమ్మ దగ్గరి నుంచి ఇంకా తాతయ్య దగ్గరి నుంచి ఉత్తరాలు వచ్చేవి , ఇప్పటిలా హస్త భూషణాల కాలం కాదు కదా. ఇంకా హాస్టల్ కి ఒకటే ఫోన్ ఉండేది, అదీ వార్డెన్ ఎదురుగా, ఇంకేమి మాట్లాడతాను నా మొహం. అప్పటి దాకా ఇంట్లో బాగా గారాబం వల్ల , హాస్టల్లో చేరిన కొత్తలో నాకు అన్నీ సమస్యల్లాగే అనిపించేవి. అవి అన్నీ ఆ చుంచు మొహం వార్డెన్ ఎదురుగా ఏం చెప్తాను . అసలు నాకో విషయం అర్థం అవదు. ఆడ వార్డెన్లు గా చుంచు మొహం ఉన్నవారినే తీసుకుంటారా లేక పోస్ట్ లోకి వచ్చిన తర్వాత ఆ మొహాలు అలా తయారవుతాయా? ఏమో మరి ? లేక పోతే నాలా ఇంటి బెంగతో బాధ పడే వారిని చూస్తే వారికి ఏమైనా పైశాచిక ఆనందం కలుగుతుందేమో .. ఏంటో ఇది తాతయ్య గుర్తొస్తున్నారు అని మొదలెట్టి ఎక్కడికో వెళ్లి పోయాను. విషయం ఏమిటంటే అప్పుడు నేను అందుకునే ఉత్తరాలు చాలా అంటే చాలా బాగుండేవి. అమ్మ రాసే లెటర్స్ ఎంకరేజింగా ఉంటే తాత లెటర్స్ చాలా ఆధ్యాత్మికంగా ఉండేవి. నేను మరీ ఇష్టంగా చదివేదాన్ని . అయినా ఆ ఆధ్యాత్మిక అనుబంధం ఇప్పుడు మొదలైంది కాదు. నాకు సరిగ్గా ఊహ తెలియని వయసు లోనే మొదలై నాతో పాటే పెద్దదైంది. బాగా చిన్నగా ఉన్నప్పుడు కథలు , తర్వాత పాటలు నుంచి మెల్లగా పద్యాల్లోకి వెళ్ళింది. చెప్పాలంటే ఆయన లోని గొప్పతనం అదే. ఈ వయసు లో వాళ్ళకి ఎలా చెపితే అర్థం అవుతుందో అలాగే చెప్పేవారు. కానీ అవన్నీ రికార్డు చేసి పెట్టుకోవాలన్న ఆలోచన నాకు ఎప్పుడూ రాలేదు. బహుశా అవన్నీ ఆయన నోటి నుంచే ఎప్పటికీ వింటాను అనే ఊహ లో బ్రతికే దాన్నేమో . నా దురదృష్టం ఏమిటంటే మా అమ్మకు ఆ ఆలోచన వచ్చేసరికే సమయం మించి పోయింది. అప్పటికే food pipe cancer తో తాత మాట్లాడలేని స్థితి కి చేరుకున్నారు. ఆయన ఒక నిజమైన యోగి. తామరాకు మీద నీటి బొట్టులా ఈ సంసారం లో ఉంటూనే ఆధ్యాత్మికంగా ఉన్నత స్థాయిని చేరుకున్న యోగి. ఆ నడయాడే విజ్ఞాన సర్వస్వం మాకు దూరంగా తనెంతగానో తలచుకున్న ఆ గోలోక బృందావనానికి తన విజ్ఞానం తో సహా కదలి పోయింది.

నాకు ఊహ తెలిసిందో లేదో నాకు తెలియదు కానీ తాత ను నేను ఫస్ట్ టైం చూసింది చేతిలో ఒక బ్లూ కవర్ తో ఉన్న చిన్న పిల్లల సైకిల్ తో . నాకు ఎందుకో ఆ విషయం బాగా గుర్తుండి పోయింది. ఎన్ని కథలు చెప్పించుకునే దాన్నో . . ఎన్ని పాటలు వినిపించారో . . ఇంకో విషయం ఏమిటంటే ఆ పాటలు చాలా వరకూ నేనే రాసేదాన్ని. అంటే టేప్ రికార్డర్ లో వచ్చే పాటని వింటూ రాసేదాన్ని. అప్పట్లో అందరికీ ఆశ్చ్యర్యం అలా వింటూ ఎలా రాసేదాన్నా అని. నా చేతి రాత కూడా కొంచం బాగుంటుంది , దాని వల్ల తాతకి నాతో రాయించటం అంటే చాలా ఇష్టంగా ఉండేది. నేను కూడా సరదా పడేదాన్ని.

ఇంకా చాలా విశేషాలు, అనుభూతులు... కానీ దుఃఖంతో మొద్దు బారిన మెదడు ఆలోచనలని అడ్డగిస్తోంది.
ఏదేమైనా ఈ లోటు తీరదు...
"పోయినోల్లందరూ మంచోళ్ళూ ...
ఉన్నోళ్ళూ పోయినోళ్ళ తీపి గురుతులు..."

Wednesday, June 3, 2009

సిరివెన్నెల-1

మొదటగా నాకెంతో ఇష్టమైన సిరివెన్నెల పాటని మీతో పంచుకుంటున్నా...


విధాత తలపున ప్రభవించినదీ అనాది జీవన వేదం ఓం...
ప్రాణనాడులకు స్పందననొసగిన ఆది ప్రణవ నాదం ఓం...
కనుల కొలనులో ప్రతిబింబించిన విశ్వరూప విన్యాసం
ఎద కనుమలలో ప్రతిధ్వనించిన విరించి విపంచి గానం...

సరసస్వర సుర ఝరీ గమనమౌ సామ వేద సారమిది
నే పాడిన జీవన గీతం ఈ గీతం
విరించినై విరచించితిని ఈ కవనం
విపంచినై వినిపించితిని ఈ గీతం


ప్రాగ్దిశ వీణియ పైనా దినకర మయూఖ తంత్రుల పైనా
జాగృత విహంగ సతులే వినీల గగనపు వేదిక పైనా
ప్రాగ్దిశ వీణియ పైనా దినకర మయూఖ తంత్రుల పైనా
జాగృత విహంగ సతులే వినీల గగనపు వేదిక పైనా
పలికిన కిలకిల పదముల స్వరగతి జగతికి శ్రీకారము కాగా
విశ్వకావ్యమునకిది భాష్యముగా "విరించినై ... "

జనించు ప్రతి శిశు గళమున పలికిన జీవన నాద తరంగం
చేతన పొందిన స్పందన ధ్వనించు హృదయ మృదంగ ధ్వానం
జనించు ప్రతి శిశు గళమున పలికిన జీవన నాద తరంగం
చేతన పొందిన స్పందన ధ్వనించు హృదయ మృదంగ ధ్వానం
అనాది రాగం ఆది తాళమున అనంత జీవన వాహినిగా
సాగిన సృష్టి విలాసమునే "విరించినై ... "

నా ఉచ్చ్వాసం కవనం
నా నిశ్వాసం గానం

సరసస్వర సుర ... గీతం

తప్పులుంటే తెలియ చేయండి... సరిదిద్దుకుంటాను.


చిత్రం - సిరివెన్నెల
సంగీతం - కే.వి.మహదేవన్ గారు
సాహిత్యం - సీతారామ శాస్త్రి గారు
దర్శకత్వం - కే.విశ్వనాధ్ గారు
నిర్మాత - ....... (నాకు తెలీదు... ప్చ్)

పరిచయం

హాయ్...
నాకు పాటలంటే చాలా ఇష్టం.
ఆ పాటల్లోని మాటలంటే మరీ ఇష్టం.
చాలా పాటలని ఆ సాహిత్యం కోసమే లెక్క లేనన్ని సార్లు విన్నాను.
నేను చాలా రోజుల నుంచి నాకు తెలిసిన పాటల సాహిత్యాన్ని ఒక బుక్ లో రాస్తున్నాను
కానీ ఈ రోజెందుకో అనిపించింది అంత గొప్ప సాహిత్యాన్ని నేను మాత్రమే అనుభూతించడం, ఆనందించడం న్యాయం కాదేమో అని.
అందుకనే ఈ బ్లాగ్ మొదలు పెడుతున్నా.
నాలాంటి అభిరుచి, ఆసక్తి ఉండీ సమయాభావం వల్ల సాహిత్యాన్ని సేకరించలేక, కోల్పోతున్నామేమో అని మనసులో ఏదో ఒక మూల వెలితిగా ఫీల్ అవుతున్న వారిలో ఒకరైనా ఈ బ్లాగ్ చూసి సంతోషిస్తే, బ్లాగ్ లక్ష్యం సాకారమైనట్లే.